Header Ads

2019 ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీలకు నేర్పిన పాఠాలేంటి?


ఈ మధ్యనే జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రంలో బిజెపి, కాంగ్రెస్ మధ్య ఆసక్తికర పోరు జరిగి వన్ సైడ్ వార్ గా ముగిసాయి.  ఇంతకీ ఈ ఎన్నికల ఫలితాలు ఏ ఏ పార్టీకి ఎలాంటి గుణపాఠాలు నేర్పాయి?  ఈ ఫలితాలను ముందస్తుగానే తెలంగాణ సీఎం అంచనా వేసారా?  అందుకే ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలకు తెరలేపి తన పని తాను శీగ్రంగా కానిచ్చేసుకున్నారా?  అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. 
ఈ ఎన్నికలకు ముందు వెలువడిన సర్వే రిపోర్ట్ లు కూడా సందిగ్ధంగా ఉండటంతో వెలువడబోయే ఫలితాలను కొందరు బిజెపికి అనుకూలంగా, మరికొందరు కాంగ్రెస్ కు అనుకూలంగా అంచనా వేసి వ్యూహాలు అమలు చేస్తూ ఎన్నికల క్షేత్రంలో పాల్గొన్నారు.  కొన్ని సర్వేలు కేంద్రంలో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవచ్చుననే అంచనా తెలుపడంతో దేశంలోని ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఉద్దేశంతో ఎన్నికలకు ముందే ప్రాంతీయ పార్టీల నేతలు ఏకమయ్యే చర్యలకు పూనుకున్నారు కూడా.  కానీ వెలువడిన ఫలితాలు ప్రాంతీయ పార్టీల నేతల ఆశలపై నీళ్లు చల్లేసాయి.  బహుశా ఈ ఎన్నికల్లో మోడీ హావా ఎంతో కొంత ఉంటుందని కేసీఆర్ ముందస్తుగానే గ్రహించి ఉంటాడు అందుకే సమయం మిగిలి ఉన్నప్పటికీ ముందస్తుగా తన పని తాను కానిచ్చేసి మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగారని విశ్లేషకులు భావిస్తున్నారు.  అయితే కేద్రంలో హంగ్ వస్తుందనే కొంత ఆశాభావంతో కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పే వ్యూహంతో 16 ఎంపీ సీట్లను కైవసం చేసుకొని కేంద్రంలో బిజెపి, కాంగ్రెస్ యేతర వేదిక ఏర్పరచడం కోసం పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుండే దేశంలోని ప్రముఖ నాయకులను కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేశారు.  కానీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వన్ సైడ్ వెలువడి మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడటానికి కావాల్సిన పూర్తి మెజారిటీ సాధించడంతో  ప్రధాని పదవి పై ఆశలు పెంచుకున్న ప్రాంతీయ పార్టీల నాయకుల కలలు కల్లలుగానే మిగిలిపోయి.
కేంద్రంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ స్పీచ్ లు ఉండటం ఆయనకు లాభించలేదు.  పై పెచ్చు బిజెపిని విమర్శించే నేపథ్యంలో "హిందూ గాళ్ళు.. బొందు గాళ్ళు.." అంటూ హిందువులను కించపరాస్తూ ఉపన్యాసాలు చేయడం వలన హిందువులలో అత్యధిక శాతం ప్రజల ఓట్లు బిజెపికి చేరిపోయాయి, అలాగే తెరాస ప్రభుత్వ వ్యతిరేక ఓటు సైతం బిజెపికి అత్యధికంగా చేరి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు, ఫలితంగా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా పుంజుకొని నాలుగు స్థానాలను బిజెపి కైవసం చేసుకొని చక్రం తిప్పడానికి "సారు" ఆశించిన "పదహారు"కు గండి కొట్టింది.  పై పెచ్చు స్వయానా ముఖ్యమంత్రి కుమార్తె సీటు గెలుచుకోలేని అవమానకరమైన ఫలితాలను అనుభవించేలా చేశాయి కేసీఆర్ "బొందు గాళ్ళ" మాటలు.  ప్రజా తీర్పును స్పష్టంగా అంచనా వేశామని, బిజెపి కేంద్రంలో మరోసారి అధికారం చేపట్టలేదనే అతి విశ్వాసం తెరాసను బిజెపికి దూరం చేసింది.  కేంద్రంలో ఎవరు అధికారం చేపడతారో అనే అంశాలపై, వెలువడబోయే ఫలితాల పై కిమ్మనకుండా కేంద్ర ప్రభుత్వాలపై వ్యూహాత్మక మౌనాన్ని వహించి, తన ప్రచారం తాను రాష్ట్ర స్థాయిలో మాత్రమే విమర్శలు చేస్తూ ముందుకు సాగిన వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ తన స్థానానికి డోకా రాకుండా ముందస్తు జాగ్రత్తలతో వ్యవహరించడంతో కేంద్రంలో మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టిన బిజెపిలో సైతం తనకు ప్రాధాన్యం ఉండేలా పరిస్థితులను తన అదుపులో ఉంచుకోగలిగాడు.  వ్యూహాత్మకంగా వ్యవహరించకుండా వివాదాస్పద వ్యాఖ్యలతో కేసీఆర్ సీట్లు నష్టపోయి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బిజెపితో సత్సంబంధాలకు దూరమవుతున్నారని భావించవచ్చు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల విషయాలకు వస్తే.. "యు" టర్న్ లకు ప్రఖ్యాతి గాంచిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్న తొలినాళ్లలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? అంటూ, హోదాతో కాదు, ప్యాకేజీ తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించి, బిజెపి ప్రభుత్వ నిర్ణయాలైన నోట్ల రద్దు, జీఎస్టీలను పొగిడేసి.. తర్వాత ప్రభుత్వ టర్మ్ ముగిసే సమయానికి తన స్టాండ్ పై "యు" టర్న్ తీసుకొని హోదా పై బిజెపిని నిలదీస్తూ హోదా కోసం దీక్షలు చేస్తూ హోదా విషయంలో ప్రజా క్షేత్రంలో బిజెపిని ముద్దాయిగా చూపించి, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేసి, కాంగ్రెస్ తో జట్టు కలిపి ఎన్నికల గోదాలోకి దిగారు.  బాబుగారి యు టర్న్ లు, రాష్ట్ర రాజకీయాలకు అంతగా అనుభవం లేని బాబు పుత్రరత్నం లోకేష్ చేతిలో రాష్ట్రాన్ని పెట్టేసి ఆయన ఢిల్లీ రాజకీయాల పై దృష్టి కేంద్రీకరిస్తారేమో నేనే ఆంధ్ర ప్రజల సందేహాలు,  స్థిరమైన పట్టుదల, ధ్యేయంతో ఐదు సంవత్సరాలుగా ఓదార్పు యాత్రలు, పాద యాత్రల పేరుతో జనాల మధ్య గడిపిన వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని ఆంధ్ర ప్రజలు తమ ముఖ్యమంత్రిగా ఎంచుకునేలా చేస్తూ తెదేపాకు కనీస గౌరవ ప్రదమైన సీట్లు సైతం దక్కకుండా చేశాయి.  బాబు వేసిన అంచనాలు తలకిందులుగా మారి కేంద్రంలో కాంగ్రెస్ కు అతి తక్కువ సీట్లు దక్కి మళ్ళీ బిజెపి స్వతంత్రంగా అధికారం చేపట్టడం బాబు మరియు ఆయన అనుచర గణం నేర్చుకోవాల్సిన గుణపాఠాలెన్నో ఈ ఎన్నికలు వదిలేసి వెళ్లాయి.  ప్రత్యర్థి బలాన్ని తక్కువగా అంచనా వేయడం, రాజకీయ అంశాలపై అతిగా "యు"టర్న్ లు తీసుకోవడం, మనమేది చేసినా, ఏది చెప్పినా ప్రజలలో చెల్లుబాటు అవుతుందని అతిగా విశ్వసించడం, స్థిరమైన స్టాండ్, స్థిరమైన విధానం లేకపోవడం వలన మొదటికే మోసమొస్తుందని ఈ ఎన్నికలు నిరూపించాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చెందిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ గత ఎన్నికల్లో తెదేపాకు మద్దతు పలికి ఎన్నికల్లో పోటీ చేయకుండా మంచి పనే చేసింది.  అయితే గడిచిన ఐదేళ్లలో పవన్ తన పార్టీ "జనసేన"ను తన అభిమానులకు మాత్రమే పరిమితం చేయకుండా ప్రజలలోకి పార్టీ విధి విధానాలను తీసుకెళ్లడంలో విఫలమవడం, అధికార పార్టీ వైఫల్యాలు కోకొల్లలుగా ఉన్నప్పటికీ వాటిపై స్పందించకుండా ప్రతిపక్షం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం, తన పార్టీ విధి విధానాలు ఏ వేదిక పై కూడా స్పష్టంగా ప్రజలకు తెలియజేయలేకపోవడం.  రాష్ట్రానికి, ప్రజా సమస్యలకు సంబంధం లేని చేగువేరా గాధలు, శ్రీ శ్రీ సూక్తులు, తమిళ, ద్రావిడ, ఉత్తర భారత, దక్షిణ భారత వేర్పాటువాద వ్యాఖ్యలు, తెలంగాణాలో ఆంధ్ర వాళ్ళను కొడుతున్నారని, తెలంగాణ వచ్చినప్పుడు తాను అన్నం తినడం మానేశానని ఉభయ రాష్ట్ర సంబంధాలకు, ప్రజలలో ఐకమత్యానికి భంగం వాటిల్లే వ్యాఖ్యలు, రాష్ట్ర ప్రత్యేక హోదా సాధనకు ప్రత్యేక ప్రణాళికలు ఏమి అమలు చేయకపోవడం, ప్రజా సమస్యలకు సంబంధంలేని ఆవేశపూరిత ఉపన్యాసాలతో తన అభిమానులను మాత్రమే ఎంటర్టైన్ చేయగలిగాడు తప్పితే సగటు ఓటరును ప్రభావితం చేయలేకపోయి పార్టీ అధ్యక్షుడైన తాను కూడా రెండు స్థానాలలో సైతం ఓటమి చవి చూసి ఘోర పరాభవం మూటగట్టుకున్నారు.  పార్టీలో రాష్ట్రం మొత్తం మీద ఒక స్థానాన్ని (రాజోలు నియోజకవర్గం) అతి కష్టంగా గెలుపొందగలిగాడు.  అయితే, మరో ఐదు సంవత్సరాలు గతంలో చేసిన తప్పులనే మళ్ళీ చేయకుండా ప్రజా సమస్యల పై దృష్టి పెట్టి, అధికార ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టుతూ, ప్రజల మద్దతు, సానుభూతిని సంపాదిస్తూ, నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ, స్థిరమైన విధానం, నినాదంతో తనకు అధికారం అందిస్తే తాను ప్రజాభివృద్ధి కోసం చేయబోయే కార్యక్రమాలను ప్రజలకు తెలుపుతూ 2024 వరకు నిత్యం ప్రజా క్షేత్రంలో గడిపితే తప్పకుండా పరిస్థితులు ఆశాజనకంగా మారి పవన్ కళ్యాణ్ జనసేన ఏపీ రాజకీయాలలో ప్రముఖమైన పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు.  కానీ స్థిరత్వం, నాయకత్వ లక్షణాలు 2024 వరకు ప్రజా క్షేత్రంలో గడపడం, ప్రజలలో నమ్మకాన్ని సాధించడంలో పవన్ ఎంతమేర సఫలీకృతం కాగలదనేది కాలమే నిర్ణయిస్తుంది.
ఇక కేంద్రంలో 2014 కంటే 2019 ఎన్నికల సమయానికి రాహుల్ గాంధీ చాలా పరిణతి చెందారని చెప్పాలి, అతి ధృడమైన మోడీ మానియాను రాహుల్ గాంధీ ఎదుర్కోవలిసి రావడం రాహుల్ ను ప్రధానిగా చూడాలనుకునే సగటు కాంగ్రెస్ అభిమానులకు దురదృష్టకరమే..  ధృడమైన శత్రువు ఎదురుగా ఉన్నప్పటికీ పోరాట పటిమ కనబరిచి సాధ్యమైనంత మేర పోరాడి కొంత పరిణతిని సంపాదించాడు రాహుల్ గాంధీ.  అలాగే 2014 ఫలితాలతో పోల్చుకుంటే 2019 కాంగ్రెస్ సీట్లలో కొంత అభివృద్ధి సాధించగలిగారు.  నిరుత్సాహ పడకుండా ఇదే పోరాట స్పూర్తితో ముందుకెళ్తే రాహుల్ గాంధీకి ఒక అవకాశం ఇవ్వాలనే తలంపు, సానుభూతి దేశ ప్రజలలో జనించి 2024 మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి.

మొత్తం మీద అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అన్నట్లుగా 2019 ఎన్నికల ఫలితాలు కొందరి ఆశలను అడియాశలు చేసేసి, కొందరు అనుభవజ్ఞులైన రాజకీయ పండితుల అంచనాలను తలక్రిందులు చేసేసి, అన్ని రాజకీయ పక్షాలకూ పాఠాలు నేర్పాయి.  ఈ అనుభవాలను పరిగణనలోకి తీసుకొని నిర్దిష్టమైన కార్యాచరణ రచియించి ముందుకుసాగుతే రాబోయే రోజుల్లో మెరుగైన ఫలితాలు రాబట్టుకునే అవకాశాలు ఉన్నాయి.



See Also: Srinivas, Gundoju, Article, Indian, Political, Politics, Elections, 2019, Results, Analysis, Telugu, GS,

1 comment:

  1. As claimed by Stanford Medical, It's really the ONLY reason this country's women get to live 10 years more and weigh an average of 19 kilos lighter than us.

    (And by the way, it is not related to genetics or some hard exercise and EVERYTHING to around "how" they eat.)

    P.S, I said "HOW", and not "WHAT"...

    CLICK on this link to reveal if this little test can help you find out your real weight loss possibilities

    ReplyDelete