Header Ads

జాతీయవాదం, దేశభక్తికి బిజెపిని బ్రాండ్ అంబాసిడర్ గా మారుస్తున్నదెవరు..?


Nationalism, Patriotism credits going to BJP article by Srinivas Gundoju
రాజకీయ చదరంగంలో అడుగు పెట్టాక రాజకీయ పార్టీల మధ్య అధికార దాహంతో వ్యూహ ప్రతి వ్యూహాలు తప్ప ప్రజా శ్రేయస్సు, సర్వమత సమానత్వం, నిజమైన లౌకిక వాదం ఉండవనేది ప్రజలు తెలుసుకోవాల్సిన చేదు నిజం..  కొందరు లౌకిక వాదం మాటున హిందూ మతాన్ని టార్గెట్ చేసి దూషిస్తే, మరికొందరు టెర్రరిజం పేరుతో ముస్లిం మతాన్ని దూషించటం, హిందూ ముస్లిం ఓట్ల వేటలో హిందూ ముస్లిం ప్రజల మధ్య ఎప్పటికీ ఆరని రావణ కాష్టానికి ఆజ్యం పోస్తూ చలి కాచుకోవడమే తప్ప ఆయా మతాలకు చెందిన ప్రజలపై ప్రేమానురాగాలు కనబరచడం మాత్రం కాదని ఎరుగాలి.  నిజమైన లౌకిక వాది ఉగ్రవాదాన్ని ఒక మతానికి ముడి పెట్టి చూడడు, అలాగే ఒక మత విశ్వాసాలను, మత దేవతా మూర్తులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడని అన్ని మతాల ప్రజలు గ్రహించాలి.

బిజెపికి ఇతర పార్టీలు గత కొన్ని దశాబ్దాలుగా మతతత్వ పార్టీ, హిందూమత పార్టీ అనే ముద్రను వేస్తూ బిజెపిని ఎన్నికల రణరంగంలో ఎదుర్కొంటూ వస్తున్నాయి.  నిజానికి ఐదు సంవత్సరాల ముందు వరకు బిజెపికి హిందూ పక్షపాత పార్టీ, మతతత్వ పార్టీ అనే టాగ్ లైన్ పెద్ద అవరోధంగానే పరిణమించేదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు.  ఇతర పార్టీలు తమ పార్టీ పై మతతత్వ పార్టీగా ముద్ర వేస్తున్నప్పటికీ ఎన్నికలలో గెలుపోటములతో సంబంధం లేకుండా.. ఓటు బ్యాంకు రాజకీయాలకు తావివ్వకుండా ముస్లిం ఓట్ల కోసమో, మరే ఇతర మతాలకు చెందిన ప్రజల ఓట్ల కోసమో తమ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వకుండా చావైనా రేవైనా తాము నమ్మిన సిద్ధాంతాలతోనే కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీకి మతతత్వమనే అవరోధంతో గతంలో పలు వ్యతిరేక ఫలితాలను చవిచూసినప్పటికీ ముందుకు సాగుతూనే వచ్చింది.  మతతత్వ పార్టీగా ముద్రింపబడిన బిజెపితో పొత్తు పెట్టుకోవాలంటే తమ పార్టీని కూడా మతతత్వ పార్టీగా పరిగణిస్తారేమోననే సందేహంతో ఇతర పార్టీల వారు బిజెపితో పొత్తుకు సంశయించేవారు.  కాలం గడుస్తున్నకొద్దీ.. ఏదైతే హిందూ మత పార్టీ అనే ముద్ర బిజెపికి అవరోధమని విశ్లేషకులు సైతం భావించారో అదే ముద్ర ప్రస్తుతం అనుకూల అంశంగా బిజెపికి తోడ్పడుతోందనేది గమనించాల్సిన విషయం.  బిజెపికి హిందూ మత ప్రజల ఓటు బ్యాంకు తోపాటు ఈ మధ్యనే మతాలతో సంబంధం లేకుండా అన్ని మతాలు సమర్ధించే జాతీయ వాదాన్ని కూడా బిజెపి తన పేటెంట్ రైట్ గా పొందుతోంది.  కలిసొచ్చే కాలమొస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడన్నట్లుగా బిజెపికి హిందుత్వంతో పాటు దేశ భక్తి, జాతీయవాదం కూడా తోడై భారతదేశంలో తిరుగులేని అతి పెద్ద పార్టీగా ప్రస్తుతం అవతరించింది. 
కానీ జాతీయవాదం, హిందుత్వం, దేశభక్తి అంశాలకు పేటెంట్ హక్కులను బిజెపి తమకు తాముగా మాత్రం పొందలేదని కొంత విశ్లేషిస్తే అవగతమవుతోంది.  దేశంలో అధిక జనాభా కలిగిన అతి పెద్ద మతం హిందూ మతం.  ఈ మత ప్రజలలో బిజెపిని హిందుత్వ పార్టీగా గుర్తింపు పొందేలా చేసింది బిజెపియేతర పార్టీల నాయకులే..!!  బిజెపిని ఇరుకున పెట్టేందుకు బిజెపి అండగా నిలుస్తోన్న హిందూ మతం పై, ఆ మత విశ్వాసాలపై, హిందూ మత దేవతా మూర్తులపై కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ బిజెపిని ఎదుర్కొనే వ్యూహం బిజెపియేతర పార్టీలు చేయడంమే బిజెపి హిందువులను అతి చేరువ అయ్యేలా చేసింది.  ఈ క్రమంలో లౌకిక వాద ముసుగులో కమ్యూనిస్ట్, కాంగ్రెస్ ఇతర పార్టీల నాయకులు హిందూ మతస్థులు దేవతలుగా భావించే దేవతా మూర్తులపై, హిందూ మత విశ్వాసాలపై  తీవ్ర విమర్శలు గుప్పించడం అందుకు కౌంటర్ గా బిజెపి నాయకులు (హిందూ మతం తరుపున) ప్రతి విమర్శలు చేయడం, నిరసన ప్రదర్శనలు చేయడం హిందూ మత ప్రజలకు బిజెపిని అతి చేరువ చేసింది.  బిజెపిని విమర్శించాలనుకునే ఇతర పార్టీల నాయకులు బిజెపి అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాకుండా హిందూ మతాన్ని, ఆ మత విశ్వాసాలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించడంతో తమకు తెలియకుండానే హిందూ మత ప్రజల విశ్వాసం బిజెపి పొందేలా, హిందుత్వంకు బిజెపి బ్రాండ్ గా మారేలా చేయడం జరిగింది.  హిందూ మతాన్ని విమర్శించడం ద్వారా ఇతర పార్టీల నాయకులు బిజెపికి నష్టం చేయకపోగా అత్యధిక ఓటు బ్యాంకు గల మత ప్రజలను బిజెపికి పేటెంట్ గా నిలిచేలా చేశాయి.  అందుకు ఉదాహరణ గా ఇటీవలే తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఒక భహిరంగ సభ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన "హిందూ గాన్లు.. హిందూ గాన్లు.." అనే వ్యాఖ్య హిందూ మత ప్రజలలో తీవ్ర అసహనానికి గురి చేసింది, అందుకు హిందువుల తరుపున మద్దతుగా బిజెపి నిలిచి తెరాస పై విమర్శలు గుప్పించడంతో తెలంగాణాలో బిజెపికి మోడీ మానియాతో పాటు మెజారిటీ హిందువుల ఓటు బ్యాంకు చెందేలా చేసింది.  ఫలితంగా తెలంగాణాలో చెప్పుకోదగిన ఓటు బ్యాంకు లేని బిజెపికి నాలుగు ఎంపీ స్థానాల విజయంతో గ్రాండ్ గా తన ఖాతా తెరిచినట్లైంది.

ఇకపోతే జాతీయవాదం, దేశ భక్తి అంశాలు కూడా బిజెపికి పేటెంట్ గా లభించేలా చేసింది కూడా విపక్ష పార్టీలే కావడం విశేషం..!!  అందుకు ఉదాహరణలుగా గడచిన ఐదేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు మోడీ అవలంభించిన ప్రజా వ్యతిరేక విధానాల పట్ల చెప్పుకోదగినట్లుగా విమర్శించని విపక్ష పార్టీలు.  నరేంద్ర మోడీ నాయకత్వంలో మొదట జరిగిన సర్జికల్ స్ట్రైక్ పై అనుమానాలను వ్యక్తపరుస్తూ, దేశంలో ఉగ్ర దాడులకు ప్రయత్నించిన కసబ్ లాంటి ఉగ్రవాదుల మరణ శిక్ష, ఉగ్రవాద సానుభూతిపరుడైన యాకుబ్ మెమెన్ మరణ శిక్ష పై కూడా సానుభూతి వ్యక్తం చేయడం, యూనివర్సిటీ లలో విద్యార్థి సంఘాల మాటున ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిచ్చే విధంగా యువతను ప్రక్కదోవ పట్టించే వారికి మద్దతు తెలపడం, ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వ విధానాలను తప్పుపట్టడం, ఫలితంగా బిజెపి దేశభక్తి రాగం ఆలపించి జాతీయవాదాన్ని తమకనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం చేయడం బిజెపిని దేశభక్తి, జాతీయవాదంగల ప్రజలకు చేరువ చేసింది.  అలాగే ఈ మధ్యనే జరిగిన పుల్వామా దాడి పట్ల చనిపోయిన సైనికులకు నివాళులు అర్పించడంలో అంతగా కనబరచని శ్రద్ధ ఆ దాడి పాకిస్థాన్ చేసి ఉండదని శత్రు దేశాన్ని వెనకేసుకురావడంలో కనబర్చడం విపక్షాల తీరును తేటతెల్లం చేశాయి.  పుల్వామా ఉగ్రదాడికి సమాధానంగా భారత ప్రభుత్వం వారం రోజులలోపే పాక్ ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేన చే జరిపిన రెండో సర్జికల్ స్ట్రైక్ తో సుమారు 300 పైగా ఉగ్ర మూకలను హతమార్చి, అంతర్జాతీయ మీడియా సైతం ధృవీకరిస్తే.. సర్జికల్ స్ట్రైక్ జరిగిందని గ్యారంటీ ఏంటి..? మాకు ఆధారాలు చూపాలి..!! అని తృణమూల్ నేత మమతా అండ్ కో, కాంగ్రెస్ నాయకులు, ఆమ్ ఆద్మీ నాయకులు కేజ్రీ వాల్, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు సైతం అనుమానాలు వెలిబుచ్చడంతో జాతీయవాదులకు విపక్షాలు దూరమవుతూనే బిజెపి దగ్గరయ్యేలా చేశాయి.. పాక్ మిలిటరీకి చిక్కిన మన భారత వాయుసేన ఉన్నతాధికారి అభినందన్ ను ఒకే ఒక్క స్టేట్మెంట్ (అభినందన్ పాక్ బందీలో వారం రోజులకు మించి ఉన్నట్లయితే యుద్ధం అమలులో ఉందని భావించాల్సి వస్తుందని ప్రధాని వ్యాఖ్యానించడం)తో అభినందన్ ను క్షేమంగా వారం రోజుల లోపే ఇండియా కు పాక్ ప్రతినిధులు అప్పగించడం దాని పై కూడా విపక్ష పార్టీలు ఆ ఘనత అంతా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దే అన్నట్లుగా, ఆయన శాంతి కాముకుడు కాబట్టే మన వాయుసేన ఉన్నతాధికారి అభినందన్ ను ప్రాణాలతో ఇండియాకు అప్పగించారని వ్యాఖ్యలు చేయడం.. ఇంచు మించు పోర్న్ వీడియో లకు సరి సాటిలా ఉండే ముద్దు, సెక్స్ సీన్లు సినిమాలలో ప్రదర్శించినప్పటికీ అభ్యంతరం తెలుపని వారు, జాతీయ గీతాన్ని సినిమా హాళ్లలో ప్రదర్శించడాన్ని వ్యతిరేకించడం.. పాక్ ఉగ్రవాదాన్ని వెనకేసుకురావడం అదే స్థానంలో హిందుత్వాన్ని ఉగ్రవాదంతో పోల్చడం.. మొదలగు విపక్షాల వైఖరి బిజెపికి చేటు చేయలేకపోగా జాతీయతావాదం, దేశ భక్తి కలిగిన పార్టీగా అత్యధిక దేశ ప్రజలు బిజెపిని గుర్తించే విధంగా చేశాయి.  ఇందుకు నిరూపణగా ఎప్పుడు లేని విధంగా 8% ముస్లిం ఓట్లు సైతం ఈ ఎన్నికల్లో బిజెపి కైవసం చేసుకున్నట్లు సి.యన్.డి.ఎస్. కంపెనీ నిర్వహించిన సర్వే రిపోర్ట్ లో తేటతెల్లమైంది. 
బిజెపిని ఇరుకున పెట్టాలనుకునే విపక్ష పార్టీలు బిజెపి అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించకుండా, హిందుత్వం, జాతీయవాదం, దేశభక్తి అంశాల పై ఎక్కువ విమర్శలు ఎక్కుపెట్టడం మూలాన బిజెపికి చేటు చేయలేకపోగా దేశంలో ఇప్పటికే పేటెంట్ రైట్ కలిగి ఉన్న హిందుత్వంతో పాటు జాతీయవాదం, దేశభక్తి అంశాలకు బిజెపి పూర్తి స్థాయిలో బ్రాండ్ అంబాసిడర్ గా మారి, పేటెంట్ రైట్ కలిగి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.  రాజకీయంలో ప్రత్యర్థి పార్టీని ఎదుర్కోవాలనే తలంపు సమర్థనీయమే అయినప్పటికీ ఎంచుకోవాల్సి దారి విషయంలో ఒకటికి పది సార్లు ఆచి తూచి ఆలోచించి ఎంచుకోవాలనేది బిజెపి అభివృద్ధికి దోహదపడిన విపక్ష పార్టీల విధానాలు చూస్తే అవగతమవుతోంది.  ఇకనైనా అదనపు ఓటు బ్యాంకును శత్రు పార్టీకి అప్పజెప్పే వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ప్రజా శ్రేయస్సుకు దోహదపడే అంశాలను లేవనెత్తుతూ, అధికార పార్టీ అవలంభించే ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టుతూ బిజెపియేతర పార్టీలు తమ ఉనికిని కాపాడుకుంటామని ఆశిద్దాం.



Tags: narendra, modi, bjp, mody, mamata, benarji, rahul, gandhi, congress, tdp, trs, kcr, cbn, andhra, pradesh, politics, updates, latest, news, india, political, analysis, srinivas, gundoju, article, telugu, bjp

No comments